గులాబీలో అంతర్మథనం
దక్కనుందా తిరిగి విజయం
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. గులాబీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 10 ఏళ్లుగా తెలంగాణ పేరుతో పాలన సాగించినా చివరకు ప్రజలు పరాజయాన్ని కట్టబెట్టారు. ముచ్చటగా మూడోసారి పవర్ లోకి వస్తామని ఆశించింది భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) . అంతకు ముందు అన్నీ తానై వ్యవహరించారు మాజీ సీఎం కేసీఆర్. ఇదే సమయంలో తనయుడు కేటీఆర్ ను సీఎం చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ దశాబ్ద కాలంలో ఎక్కడ పొరపాట్లు జరిగాయనే దానిపై సమీక్షించుకోక పోవడం, మితిమీరిన ఆత్మ విశ్వాసం కొంప ముంచిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ప్రత్యేకించి అధికారం పేరుతో ప్రజా ప్రతినిధులు సాగించిన ఆధిపత్య ధోరణి ప్రభావం పూర్తిగా దెబ్బ కొట్టింది. కల్వకుంట్ల కుటుంబం మరోసారి పునారోచనలో పడింది
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిగా పసిగట్టడంలో సక్సెస్ అయ్యింది. ఇక టీఆర్ఎస్ ఎప్పుడు బీఆర్ఎస్ గా మారిందో అప్పటి నుంచి కొంత ఇబ్బంది పడ్డారు నేతలు కింది స్థాయిలో. ప్రతి చోటా ప్రజలు ప్రతి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని పార్టీ సమావేశంలోనే ఒప్పుకున్నారు కేటీఆర్. పాలనపై దృష్టి పెట్టామని కానీ పార్టీ క్యాడర్ ను పట్టించుకోలేక పోయామంటూ వాపోవడం ఒకింత విస్తు పోయేలా చేసింది. ఎమ్మెల్యేను సెంటర్ పాయింట్ గా చేయడం పార్టీని వెనక్కి నెట్టివేసేలా చేసిందని ఒప్పుకున్నారు. కార్యకర్తలకు ప్రజలకు మధ్య దూరం పెరగడం కూడా ప్రభావం చూపించిందని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేసినా చివరకు ఓటర్లు ఎందుకు తమ వైపు మళ్ల లేదనే దానిపై పునరాలోచనలో పడ్డారు. పార్టీకి ప్రధాన కారణం కార్యకర్తలే. పనులు చేయక పోయినా నేతలుగా బతికి ఉండాలన్నా , ప్రజల మధ్య ఉంటే చాలు. కానీ ఇవేవీ చేయలేక పోయారు.
ఇదే సమయంలో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీపై , క్యాడర్ పై ప్రభావితం చూపిస్తాయి. దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణలో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేసినా ఎందుకు తమను ఆదరించ లేక పోయారో అర్థం కావడం లేదని పేర్కొనడం విచిత్రం అనిపిస్తోంది. పరాజయాన్ని తమపై కాకుండా ప్రజలపై నెట్టి వేసే ప్రయత్నం చేయడంపై కేటీఆర్ మరోసారి ఆలోచించు కోవాల్సిన అవసరం ఉంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రజా తీర్పు ఎలా ఇస్తారనేది ఉత్కంఠ నెలకొంది. ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. ఇదే సమయంలో పెద్ద ఎత్తున తిప్పి కొట్టడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయ్యిందని ఒప్పుకోక తప్పదు. మరో వైపు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ మరోసారి జూలు విదిల్చాల్సిన అవసరం ఉంది. ఆయన యుద్ద రంగంలోకి దిగితేనే పార్టీకి ఊపు వస్తుందనేది వాస్తవం. గులాబీ వికసించాలంటే చాలా కష్ట పడాల్సి ఉంటుంది. ప్రత్యేకించి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదని నిరూపించు కోవాలి. అప్పుడే ఓట్లు రాలుతాయి. పోయిన పరువు నిలబడుతుంది.