గులాబీ పార్టీలో గుబులు
రేవంత్ తో ఎమ్మెల్యేల భేటీ
హైదరాబాద్ – మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో కలకలం మొదలైంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఊహించని రీతిలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. దీంతో పార్టీ మారుతున్నారన్న అనుమానం వ్యక్తం అవుతోంది అంతటా. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ కు రేవంత్ రెడ్డి తెర తీశారన్న ప్రచారం ఉంది.
తాను విదేశీ టూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్బంగా లండన్ లో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ పై, ఆ పార్టీ బాస్ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 100 మీటర్ల లోతు తవ్వి గులాబీ పార్టీని పాతి పెడతానని శపథం చేయడం విస్తు పోయేలా చేసింది.
త్వరలోనే లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ గా మారింది. దీంతో ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. ఇదే సమయంలో ఉన్నట్టుండి బీఆర్ఎస్ కు చెందిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి, దుబ్బాకు చెందిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు కలుసుకున్నారు.
అయితే తాము ఏదో ప్రయోజనాలు పొందేందుకు కలవలేదని, కేవలం మర్యాద పూర్వకంగా మాత్రమే కలుసుకున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పడం విశేషం.