నిప్పులు చెరిగిన కేశినేని శ్వేత
విజయవాడ – రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన 11వ డివిజన్ కార్పొరేటర్ , ఎంపీ కేశినేని నాని తనయురాలు కేశినేని శ్వేత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తన రాజీనామాను ఆమోదించాక తాను పార్టీకి కూడా గుడ్ బై చెబుతానంటూ తెలిపారు. తాను కానీ, తన తండ్రి కేశినేని నాని కానీ ఏనాడూ టీడీపీని వీడాలని అనుకోలేదని చెప్పారు. అయితే పార్టీనే తమను వద్దని అనుకుంటోందని అన్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయమని పేర్కొన్నారు కేశినేని శ్వేత.
ఇంకా పార్టీని పట్టుకుని వేలాడడం మంచి పద్దతి కాదన్నారు. గౌరవం దక్కని చోట, లేని చోట ఇక ఉండడం ఎందుకని ప్రశ్నించారు. ఎంపీ పార్టీకి గుడ్ బై చెప్పాక కార్యకర్తలతో సంప్రదించి భవిష్యత్ కార్యాచారణ ఏమిటనేది ప్రకటిస్తామని చెప్పారు కేశినేని శ్వేత.
జగన్ సర్కార్ వచ్చాక కార్పొరేటర్ల ప్రాణాలకు రిస్క్ అని కూడా తెలిసి పోటీ చేశామని అన్నారు. తాము ప్రజల కోసం పని చేశామని ఇక టీడీపీ గురించి మాట్లాడాల్సిన పని లేదన్నారు. కృష్ణా జిల్లాలో జరుగుతున్న విషయాలు ఇప్పటి దాకా టీడీపీ హైకమాండ్ కు తెలియదనే భ్రమలో ఉన్నామని పేర్కొన్నారు.