నిప్పులు చెరిగిన చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీలో రాక్షస, అరాచక పాలన సాగుతోందని, జనం తీవ్ర భయాందోళన మధ్య బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశాడని, ప్రజలకు స్వేచ్ఛ అన్నది లేకుండా పోయిందన్నారు. ప్రజల తరపున గొంతు విప్పుతున్న ప్రతిపక్షాలను కావాలని లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాయ మాటలతో , ఆచరణకు నోచుకోని హామీలతో జనాన్ని మోసం చేశాడని, నట్టేట ముంచాడని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆళ్లగడ్డలో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.
జగన్ కు మూడిందని, ప్రజలు ఆయనను ఇంటికి పంపించేందుకు సిద్దమై ఉన్నారని అన్నారు. నాలుగున్నర ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము పరిశ్రమలను తీసుకు వస్తే తాను మాత్రం మద్యం, మత్తు పదార్థాలను తీసుకు వచ్చాడని ఆరోపించారు.
ఇంత కాలం ఓపికతో వేచి చూశారని, ఇక జగన్ మోహన్ రెడ్డిని, ఆయన పరివారాన్ని భరించే స్థితిలో లేరన్నారు చంద్రబాబు నాయుడు.