జగన్ రెడ్డి ఓ నియంత – షర్మిల
నిప్పులు చెరిగిన ఏపీ పీసీసీ చీఫ్
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో రాక్షస పాలన సాగుతోందన్నారు. సీఎం గా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఓ నియంత అంటూ మండిపడ్డారు. వైఎస్సార్ పార్టీలో వైఎస్ఆర్ లేడన్నారు. ఉన్నదంతా ఆ ముగ్గురేనంటూ ఫైర్ అయ్యారు.
వైవీ సుబ్బా రెడ్డి, విజయ సాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డిలే ఆ పార్టీకి భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. శనివారం గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీ పీసీసీ చీఫ్ సందర్శించారు. అనంతరం వైఎస్ షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఓ వైపు ప్రాజెక్టు గేట్లు కొట్టుకు పోతుంటే ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాం బాబు మాత్రం సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇదేనా మీ పాలన అంటూ ప్రశ్నించారు. తమ తండ్రి దివంగత వైఎస్సార్ హయాంలో రూ. 750 కోట్లు పెట్టి కట్టారని అన్నారు. లక్ష ఎకరాలకు సాగు నీరు ఇచ్చారని తెలిపారు.
ఇది 12 మండలాల ప్రజలకు , ఒంగోలు పట్టణానికి తాగు నీరు అందిస్తోందని, దీనిని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి.