జన నేత కర్పూరీ ఠాకూర్
సర్కార్ నిర్ణయానికి స్వాగతం
పశ్చిమ బెంగాల్ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేంద్ర సర్కార్ బీహార్ కు చెందిన జన నాయకుడు కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న ఇవ్వాలని నిర్ణయించింది. ఆయన జయంతిని పురస్కరించుకుని కీలక ప్రకటన చేసింది. జనం మెచ్చిన ధీరోదాత్తుడికి పురస్కారాన్ని ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.
సామాజిక న్యాయం కోసం అలుపెరుగకుండా కృషి చేశారని కొనియాడారు. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వడం సబబేనని స్పష్టం చేశారు. బారత దేశానికి సంబంధించి అమూల్యమైన రత్నమని కొనియాడారు. బతికి ఉన్న సమయంలోనే ఇచ్చి ఉంటే బావుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు .
ఇదిలా ఉండగా మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు రాహుల్ గాంధీ. 2011లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక కుల గణన ఫలితాలను బిజెపి ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించారు. దేశవ్యాప్త జనాభా గణన పట్ల ఉదాసీనత చూపడం సామాజిక న్యాయం కోసం ఉద్యమాన్ని బలహీనపరిచే ప్రయత్నం తప్ప మరోటి కాదన్నారు రాహుల్ గాంధీ.
దేశానికి ఇప్పుడు కావాల్సింది ‘ప్రతీక రాజకీయాలు’ కాదని ‘నిజమైన న్యాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.