జీయర్ ఆశీర్వాదం అద్దంకి సంతోషం
ముచ్చింతల్ ఆశ్రమంలో కాంగ్రెస్ నేత
హైదరాబాద్ – నిన్నటి దాకా ఉద్యమకారుడిగా గుర్తింపు పొందారు మాల మహానాడు నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. అనూహ్యంగా తాజాగా జరిగిన ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అదే సమయంలో ఏఐసీసీ హై కమాండ్ ఊహించని రీతిలో ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించి సీటు ఖరారు చేసింది.
ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. అద్దంకి దయాకర్ ఆశలపై నీళ్లు చల్లింది ఏఐసీసీ. దయాకర్ స్థానంలో హైదరాబాద్ కు చెందిన సీనియర్ నాయకుడు సంతోష్ కుమార్ గౌడ్ కు సీటు కేటాయించింది.
దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు అద్దంకి దయాకర్. ఆ మధ్యన ప్రస్తుతం కేబినెట్ లో కొలువు తీరిన రోడ్లు , భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని అనరాని మాటలు అన్నారు. ఇదే సమయంలో సంయమనం కోల్పోయి ఓ బూతు పదాన్ని కూడా ఉపయోగించారు. చివరకు ఇద్దరి మధ్య రేవంత్ రెడ్డి సయోధ్య కుదిర్చారు.
తీరా తనకు పదవి దక్కకుండా ఎవరు అడ్డు పడుతున్నారనే దానిపై ఆయన లోలోపట మధన పడుతున్నట్లు అనిపిస్తోంది. ఒత్తిడి తట్టుకోలేక దయాకర్ ఉన్నట్టుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి రామనుజ చిన్న జీయర్ స్వామి వద్దకు వెళ్లారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మరి ఇప్పుడైనా పదవి దక్కుతుందో లేదో చూడాలి.