తిరుమల క్షేత్రం పోటెత్తిన భక్త జనం
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.81 కోట్లు
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం భక్త జన సందోహంతో నిండి పోయింది. సుదూర ప్రాంతాల నుండి తరలి వచ్చే భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేసింది.
ఇందులో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 68 వేల 793 మంది భక్తులు దర్శించుకున్నారు. 26 వేల 489 మంది భక్తులు తల నీలాలు సమర్పించుకున్నారు. స్వామి వారికి భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.81 కోట్లు వచ్చినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
స్వామి దర్శనం కోసం 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 8 గంటలకు పైగా పడుతుందని తెలిపింది టీటీడీ. తిరుమల గిరులు భక్తుల గోవింద నామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి.
గోవిందా గోవిందా శ్రీనివాసా గోవిందా, అనాధ రక్షక గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా , అదివో అల్లదివో శ్రీహరి వాసము, పది వేల శేషుల పడగల మయం అంటూ భక్తులు పారవశ్యంతో పాడుకుంటున్నారు.