తెలంగాణలో కరెంట్ కోతలు షురూ
టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రకటన
హైదరాబాద్ – రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువు తీరింది. 24 గంటల పాటు గత ప్రభుత్వం విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పవర్ లోకి వస్తే కరెంట్ ఇబ్బందులు రాక తప్పవంటూ పేర్కొన్నారు.
వారు చెప్పినట్టుగానే విద్యుత్ కోతలు, అంతరాయాలు మొదలయ్యాయి. రాబోయేది వేసవి కాలం కావడంతో కరెంట్ వాడకం ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా విద్యుత్ కోత విధిస్తున్నట్లు స్పష్టం చేసింది టీఎస్ఎస్పీడీసీఎల్.
జనవరి 17 నుండి ఫిబ్రవరి 10 వరకు షెడ్యూల్ చేసినట్లు ప్రకటించింది. ఆయా ప్రాంతాలలో విద్యుత్ కోతలు, అంతరాయాల వివరాలను సంస్థకు చెందిన వెబ్ సైట్ http://tssouthernpower.com లో అప్‌లోడ్ చేయనున్నట్లు ప్రకటించింది.
టీఎస్ఎస్పీడీసీఎల్ జీహెచ్ఎంసీ పరిమితుల్లో రొటేషన్ ప్రాతిపదికన విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ల నిర్వహణ, మరమ్మతు పనులను చేపట్టనున్నట్లు తెలిపింది. వేసవిలో అత్యధికంగా డిమాండ్ ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, సహకరించాలని కోరింది.