తెలంగాణలో నేవీ రాడార్ స్టేషన్
1174 హెక్టార్ల భూముల బదిలీ
హైదరాబాద్ – తెలంగాణలో నేవీ రాడర్ స్టేషన్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు సీఎం ఓకే చెప్పారు. ఇందుకు సంబంధించి 1174 హెక్టార్ల భూమిని బదిలీ చేశారు. ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇదిలా ఉండగా భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది.
దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ ను ఉపయోగించనుంది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయనుంది.
దేశంలోనే ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్ట మొదటిది. 1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తోంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఇప్పటికే గుర్తించింది.
2010 నుంచి నావికా దళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్ లన్నీ వచ్చినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయి.
కమాండర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వికారాబాద్ డీఎఫ్ వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు.