సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్
అమరావతి – ఏపీకి చెందిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ పీవీ సునీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆయన వారి అభ్యున్నతి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా దళిత వాడలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన నివేదికను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి అందజేశారు. ఈ మేరకు సీఎం కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పీవీ సునీల్ కుమార్ వెల్లడించారు. దళితులను దళితులు మాత్రమే పాలించేలా , 1500 పంచాయతీలకు సర్పంచ్ లుగా ఎన్నికయ్యేందుకు కృషి చేయాలని కోరారు. కేవలం పదవులు అలంకార ప్రాయంగా మారాయని వాపోయారు. దారి మళ్లిన సబ్ ప్లాన్ నిధులను దళిత వాడ మార్గం పట్టించాల్సిన అవసరం ఉందన్నారు పీవీ సునీల్ కుమార్. ప్రతీ దిళిత వాడకు సంవత్సరానికి రూ. 2 కోట్లు కేటాయించాలని కోరారు. ఐదేళ్ల కాల పరిమితిలో రూ. 10 కోట్లు సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.
అంతే కాకుండా దళిత వాడకు సిమెంట్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, చెత్త కనిపించని పరిసరాలు, 40 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండేలా స్మార్ట్ స్కూళ్లు, ఉచితంగా టెస్టులు, మందులతో హెల్త్ సెంటర్ , కమ్యూనిటీ హాలు, కోచింగ్ సెంటర్ , ప్రతి ఇంటికీ నల్లా ఏర్పాటు చేయాలని సూచించారు సీఎంకు పీవీ సునీల్ కుమార్.
వీటిని ఏర్పాటు చేయాలని కోరుతూ పూర్తి వివరాలతో కూడిన నివేదికను జగన్ మోహన్ రెడ్డికి అందజేయడం జరిగిందని స్పష్టం చేశారు. మన వాడ ..మన పాలన..మన అభివృద్ది అన్నది ముఖ్యమన్నారు.