నరేంద్ర మోదీ కంటతడి
షోలాపూర్ సభలో ప్రధాని
మహారాష్ట్ర – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ కంటతడి పెట్టారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కడు పేద కుటుంబం నుంచి వచ్చిన తను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే పెంచిన వారే కారణమని అన్నారు. ఒకనాడు రైల్వే స్టేషన్ లో తన మేనమామ తో కలిసి ఛాయ్ అమ్మిన విషయం గుర్తు చేసుకున్నారు.
మనం ఎలా ఉన్నామనే దానికంటే ఏం చేశామనే దానిపై జనం ఫోకస్ పెడతారని అన్నారు ప్రధానమంత్రి. శుక్రవారం మహారాష్ట్ర లోని షోలాపూర్ లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద పేదలకు ఇళ్లను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా లబ్దిదారులకు ఇళ్లను పంపిణీ చేశారు.
చిన్నతనంలో తాము పూరింట్లో ఉన్నామని, తమకు ఒక ఇల్లు ఉంటే బావుండేదని అనుకునే వాళ్లమని అన్నారు ప్రధాన మంత్రి . తన తల్లి పిల్లల కోసం ఎంతగానో కష్ట పడిందన్నారు. ఆమె లేని లోటు తీర్చ లేనిదంటూ పేర్కొన్నారు మోదీ.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్నతనంలో తాము అనుభవించిన కష్టం చెప్పలేనిదన్నారు. ఉమ్మడి కుటుంబంలో ఎన్నో రోజులు ఉపవాసం కూడా ఉన్నామని, కానీ తనకు తల్లి విలువలు నేర్పిందన్నారు నరేంద్ర మోదీ.