నిరుద్యోగులకు ఆర్టీసీ గుడ్ న్యూస్
నాన్ ఇంజనీరింగ్ లో ట్రైనింగ్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) శుభ వార్త చెప్పింది. కొత్తగా కొలువు తీరిన సర్కార్ ఖాళీల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది. ఆయా శాఖలు అదే పని మీద ఉన్నాయి. ఇదే సమయంలో ఆర్టీసీలో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. బస్సులు సరి పోవడం లేదు. సంస్థలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ఇటీవలే ప్రకటించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
తాజాగా టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. కేవలం డిగ్రీ అర్హతతో ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ ఆర్టీసీ డిపోలలో ఉన్న నాన్ ఇంజనీరింగ్ విభాగాలలో అప్రెంటీస్ కింద శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ లేదా తత్సమాన డిగ్రీ అర్హత కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈ డిగ్రీని 2018 నుంచి 2023 మధ్య పాస్ అయిన వారు మాత్రమే అప్లై చేసేందుకు అర్హులని పేర్కొంది. వచ్చే నెల ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. పూర్తి వివరాలు, అప్లై చేసుకునేందుకు సంస్థకు సంబంధించిన వెబ్ సైట్ ను సందర్శించాలని కోరింది. సంస్థలో మొత్తం 150 ఖాళీలు ఉన్నాయని తెలిపింది .