స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – సరిగ్గా ఇవాల్టితో నెల రోజుల పాలన పూర్తయిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. సంకెళ్లను తెంచుకుని , స్వేచ్ఛను ప్రసాదించి ప్రజల ఆకాంక్షలను, ఆశలను, కలలను నిజం చేస్తూ 30 రోజుల పాలన సాగిందని గుర్తు చేశారు సీఎం.
తాము సేవకులమే తప్ప పాలకులం కాదన్న వాస్తవాన్ని నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
గతంలో పాలన కేవలం గడీలకే పరిమితమై ఉండేదని, కానీ ఇవాళ ప్రజలు స్వచ్చంధంగా తరలి వస్తున్నారని , తమ బాధలు, కష్టాలు, సమస్యలను తెలియ చేసేందుకు వందల కిలోమీటర్లను దాటుకుని ప్రజా భవన్ కు రావడం ఇది స్వేచ్ఛలో ఒక భాగమేనని పేర్కొన్నారు.
ప్రత్యేకించి పాలనను ప్రజలకు చేరువ చేశామని తెలిపారు. అన్నగా తాను ఉన్నానని హామీ ఇచ్చానని పేర్కొన్నారు. ఈ నెల రోజుల ప్రయాణం తనకు జీవిత కాలమంతా గుర్తుండి పోతుందని స్పష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి.
పేదల గొంతుక విన్నానని, యువత భవితకు దారులు వేశానని , మహాలక్ష్మి పథకం కింద ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. రైతులకు భరోసా ఇచ్చామని , ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి.