పాలకుడిని కాదు సేవకుడిని
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మధిర – తాను పాలకుడిని కాదని ప్రజలకు సేవలు అందించే సామాన్య కార్యకర్తనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. గత సర్కార్ లెక్కకు మించి అప్పులు చేసిందని ఆవేదన చెందారు. ప్రస్తుతం ఎక్కడ దుబారా ఖర్చు పెరుగుతుందనే దానిపై ఫోకస్ పెడుతున్నామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అప్పుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడమే తమ ముందున్న పెను సవాల్ అని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని అన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజానీకానికి వెలుగులు పంచుతామని చెప్పారు మల్లు భట్టి విక్రమార్క.
ప్రజల కలలు నిజం చేయడమే ఇందిరమ్మ ప్రజా పాలన లక్ష్యమన్నారు. తెలంగాణ అభివృద్ది కోసం తాను నిరంతరం పని చేస్తానని చెప్పారు . ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాంటి ప్రజా వ్యతిరేక పనులకు పాల్పడ బోమని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం.
పదేళ్ల పాటు మాజీ సీఎం కేసీఆర్ అరాచక పాలన సాగించారని ఆరోపించారు. ఏకంగా రూ. 7 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారంటూ మండిపడ్డారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు భట్టి విక్రమార్క.