పాలమూరు అభివృద్దికి పెద్ద పీట
వంశీ చందర్ రెడ్డితో సీఎం రేవంత్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పుట్టిన నేలకు ఏదో ఒక రకంగా సాయం చేసి రుణం తీర్చుకుంటానని మాటిచ్చారు. ఆయనకు ఈ ప్రాంతం అంటే ఎనలేని అభిమానం. ఎంతో కష్టపడి పైకి వచ్చిన ఆయనకు ఇక్కడి మట్టి అన్నా , ఇక్కడి ప్రజలంటే ఇష్టం. తను రైతు కుటుంబం నుంచి రావడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు దగ్గరుండి చూడడంతో వారికి మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని లండన్ టూర్ సందర్బంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
గురువారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఏఐసీసీ కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి కలుసుకున్నారు. తను ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలో అభివృద్దిపై ఇరువురు సుదీర్ఘ చర్చలు జరిపారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు, అనుమతులపై చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పాలమూరు బిడ్డగా పాలమూరు జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రత్యేకించి జిల్లాలో సాగునీరు, ఉద్యోగ ఉపాధి కల్పన, మెరుగైన విద్య ఆరోగ్య వసతుల కల్పనపై, రైల్వే లైన్లు, రోడ్ల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.