పోరాట యోధుడు తలైవర్ తిరుమావళవన్
తమిళ నాట మరో కాన్షీరాం అన్న జిలుకర శ్రీనివాస్
హైదరాబాద్ – ఆగష్టు 17 తలైవర్ తిరుమావళవన్ గారి జన్మదినం. ఇప్పుడు తనకు 63 యేండ్లు. తమిళనాట తలైవర్ అని ప్రజలంతా ప్రేమతో గౌరవించే ఏకైక నాయకుడు తను. దేశీయ తలైవర్ అని కూడా అంటూ వుంటారు. అంతేకాదు దక్షిణాది గర్వించే గొప్ప నాయకుడు. తాత్వికుడు. విముక్త చిరుతల అగ్నిగళం తలైవర్ తిరుమావళవన్ అని ప్రముఖ రచయిత మీనా కందసామి చేసిన కవితాత్మక వ్యాఖ్య సరైనదే. దేశంలో తలైవర్ లా సిద్ధాంతాన్ని ప్రజలకు అర్థమయ్యేలా, ఆ చైతన్య జ్వాలలో ప్రజలు వెలిగేలా ప్రసంగించే నాయకుడు మరొకరు కనిపించరు.
కాంగ్రెస్ పార్టీ హిందీని తమిళప్రజల మీద రుద్దాలని చూసింది. వందలాది మంది తమిళ విద్యార్థులు హిందీ వ్యతిరేక పోరాటంలో అమరులయ్యారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన పెరియార్ రామసామి, అన్నా దురై, కరుణానినిధి, ఎంజీఆర్ తదితర మహానాయకులు కాంగ్రెస్ పార్టీని లేవకుండా చేశారు. ద్రవిడ దేశం కావాలని పెరియార్ చేసిన డిమాండును అన్నా దురై, కరుణానిధి తిరస్కరించి ద్రవిడ కజగం నుండి విడిపోయి డిఎంకె ఏర్పాటు చేశారు. ఎంజిఆర్ కు కరుణానిధితో విభేదాలు వచ్చి ఎఐడిఎంకె స్థాపించారు. DMK 1967 లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి తమిళనాడులో ద్రవిడ రాజకీయాల శకం మొదలైందని చరిత్రకారులంటారు.
గత యాభై యేండ్లుగా ద్రవిడ పార్టీలు పాలిస్తున్నప్పటికీ, అవి వాటి మూలసిద్ధాంతాలతో ఆచరణలో రాజీపడ్డాయి. ద్రవిడవాదం, సామాజిక న్యాయం, తమిళ జాతీయవాదం ఈ పార్టీల సిద్ధాంతం. తందై పెరియార్ రామసామి లాగా సనాతన శక్తులతో తలపడే కార్యక్రమాన్ని ఈ కొత్త నాయకత్వం వదిలేసింది. గ్రామీణ భూస్వామ్య శక్తులు, కులోన్మాదులు ఈ రెండు పార్టీలకు పునాదిగా మారారు. కీలవేణ్మనిలో 42 మంది దళితుల సజీవ దహనం అన్నాదురై పాలనలోనే జరిగింది. హంతకులకు శిక్షపడేలా అన్నాదురై తీసుకున్న చర్యలు శూన్యం. ఆ తర్వాత కరుణానిధి పాలనలో, జయలలిత పాలనలో ఎన్నో దళితవాడలను కులోన్మాదులు కాల్చిబూడిద చేశారు. ప్రశ్నిస్తే చాలు దళితులను ఒకేసారి ఎనిమిది మందిని, తొమ్మిది మందిని నరికేశారు.
ద్రవిడ రాజకీయాలు ఇదంతా 1980 దశకం నాటి దళితుల దుస్థితి. దాడులమీద పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయరు. ఈ పరిస్థితిలో నూనూగు మీసాల యవ్వన ప్రాయంలో తిరుగుబాటు చేశాడు తలైవర్ తిరుమావళవన్. దళిత పాంథర్స్ ఆఫ్ ఇండియా నాయకుడు మలైచామీ ప్రేరణతో చరుకుగా ఉద్యమంలో పాల్గొన్నాడు. కాలేజీలో కవిగా, విద్యార్థి నాయకుడిగా తమిళ జాతీయవాదానికి, శ్రీలంకలోని తమిళ ఈళం పోరాటానికి మద్ధతుదారుడిగా తలైవర్ తిరుమావళవన్ మంచి పేరు సంపాదించాడు. కానీ తనకు ఫొరెన్సిక్ డిపార్ట్మెంటులో జూనియర్ సైంటిస్టుగా నౌఖరి వచ్చిన తర్వాత అడ్వకేట్ మలైచామితో పరిచయం దళితుల విముక్తి కోసం పనిచేసేలా చేసింది. మలైచామి అకాల మరణంతో దళిత పాంథర్స్ ఉద్యమం తిరుమావళవన్ ను నాయకుడిగా ఎన్నుకుంది.
మేకలను మాత్రమే బలిస్తారు, పులులను కాదు అని రెవల్యూషనరీ అంబేద్కర్ ఇచ్చిన పిలుపు సారం ప్రజలకు బోధించడానికి అణచివేస్తే హద్దుమీరు, తిరిగి కొట్టమని తలైవర్ తిరుమావళవన పిలుపునిచ్చాడు. ఈ పిలుపు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటున్న దళితులకు కొత్త జీవితాన్ని, కొత్త శక్తిని ఇచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తామని ఒక సర్పంచి మోసం చేశాడు. మా డబ్బులు మాకివ్వమని అడిగినందుకు ఇనుప చువ్వలతో వాతలు పెట్టి, ఒకరి మలం మరొకరితో తినిపించాడు ఆ సర్పంచి భర్త. అతడొక టీచర్. ఈ సంఘటనతో దేశమంతా ఉలిక్కిపడ్డది. తెలుగులో దళిత కవులు ఈ సంఘటనకు కలతచెంది ఆగ్రహ కవితలు రాసారు. తమిళనాడులో ఈ దురాగతాన్ని ఖండిస్తూ దోషిని అరెస్టు చేయకపోతే, మేమే శిక్షిస్తామని వేలాది మందితో ర్యాలీ తీశాడు.
ఈ పార్లమెంటరీ ఎన్నికలు బూటకమని ఎన్నికలు బహిష్కరించి వైరుధ్యాలను తీవ్రం చేయాలని, అప్పుడే అవి పరిష్కారం అవుతాయని దాడికి ప్రతిదాడి సమాధానం అన్నాడు. దాడులను ప్రతిఘటించి వీరులయ్యారు చిరుతపులులు. సుమారు మూడువందల యాభై మంది అమరులయ్యారు. అంతకు రెట్టింపు ప్రతిదాడులలో హతమయ్యారు. తలైవర్ ను చంపితే ఈ చైతన్య జ్వాల ఆరిపోతుందని భ్రమపడి పదమూడుసార్లు హత్యా ప్రయత్నం చేశారు. కానీ తలైవర్ జననాయకుడు. సామాజిక ప్రజాస్వామ్యం, సమానత్వం స్థాపించడానికి నిస్వార్థంగా పోరాడుతున్న నాయకుడు. శత్రువులు ఆయన్ని నిర్మూలించడం అసాధ్యమని గ్రహించారు. కానీ రాజ్యం ఆయన్ని లేకుండా చేయాలని కుట్రపన్నింది.
ఆ కుట్రలు గ్రహించి జాగ్రత్తలు తీసుకున్నాడు తైలవర్. పార్లమెంటరీ పంథాలోకి ఉద్యమాన్ని నడిపాడు. దశాబ్ద కాలం పాటు ప్రత్యక్ష పోరాటాలతో తీరికలేకుండా పనిచేసిన చిరుతల సైన్యం ఎన్నికలలోకి దిగింది. 1999 లో తలైవర్ తిరుమావళవన్ ఎంపిగా పోటీ చేశాడు. రెండు లక్షల ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చాయి. అదొక చరిత్ర. ఆ తర్వాత కరుణానిధితో పొత్తు పెట్టుకొని ఎమ్మెల్యేగా గెలిచాడు. తనతోపాటు దురై రవికుమార్ గెలిచాడు. 2009 లో ఎంపిగా గెలిచాడు. వరుసగా 2019 తలైవర్ తిరుమావళవన్ చిదంబరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలువగా, విల్లుపురం నుండి డి. రవికుమార్ గెలిచాడు. 2024 లో మళ్లీ ఇద్దరూ గెలిచారు. విసికె మద్ధతు లేకుండా ఏ పార్టీ గెలిచే పరిస్థితి తమిళనాడులో లేదు.
విసికె డిఎంకెతో పొత్తులో వుండి తన ఉనికి చాటుకుంటుంది అని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ రావు వ్యాఖ్యానించాడు.
కాన్షిరాం కాలం నాటి దళిత రాజకీయాలు ఇప్పుడు అసాధ్యమని ఆయన అభిప్రాయం. తమిళనాట పరిస్థితులు వేరు. ద్రవిడ రాజకీయాలు సృష్టించిన వాతావరణం వల్ల కులానికొక పార్టీ, మతానికొక పార్టీ తమిళనాడులో ఉద్భవించాయి. బహుశా ఆయా సామాజిక వర్గాల రాజకీయ ఆకాంక్షలను ద్రవిడ పార్టీలు నెరవేర్చక పోవడం వల్ల అవి అవతరించి వుండొచ్చు. ఆ కారణంగా ఏ ద్రవిడ పార్టీ కూడా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. విసికె దళిత పార్టీగా గుర్తింపు పొందింది. విసికె బలపడ కూడదని అన్ని పార్డీలు కలిసి పనిచేస్తాయి. అయినప్పటికీ విసికె బిసిలకు, మైనార్టీలకు సీట్లిచ్చి గెలిపించింది. అన్ని వర్గాల సమస్యల మీద పోరాడుతూ కుల నిర్మూలనా చైతన్యాన్ని వ్యాపింప చేస్తున్నది. విసికె మార్క్సిజం, అంబేద్కరిజం, పెరియారిజం పునాదుల మీద నిర్మాణమైన పార్టీ. తమిళ జాతీయవాదాన్ని అది ప్రచారం చేస్తుంది. ద్రవిడ భాషలు మాట్లాడే ప్రజలతో పాటు, దేశ వ్యాప్తంగా వున్న ద్రవిడ మూలవాసుల ఐక్యతను కోరుతుంది.
ముందే చెప్పినట్టు, వైరుధ్యాలను వాయిదా వేయడమో, రాజీ పర్చడమో కాకుండా తీవ్రం చేయడం ద్వారా వైరుధ్యాలను పరిష్కరించాలని తలైవర్ తిరుమావళవన్ భావిస్తాడు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, సమానత్వం, సోదరభావం అనే వాటిని వ్యతిరేకించే వ్యక్తులతో, సంస్థలతో సమూహాలతో రాజీలేని పోరాటమే ఆ వైరుధ్యాలను తీవ్రం చేసే కార్యక్రమం. తలైవర్ తిరుమావళవన్ సైద్ధాంతిక నిబద్ధత, ఎత్తుగడలు, వ్యూహాలు తమిళనాడులోనే కాదు దేశ వ్యాప్తంగా మన్ననలు పొందుతున్నాయి. ఇండియా కూటమి ఏర్పాటు ప్రతిపాదన ఆయన చింతన ఫలితమే అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక సభలో ప్రకటించాడు. తలైవర్ తిరుమావళవన్ నీలి విప్లవాన్ని నడిపిస్తున్న యోదుడు. కాన్షిరాం తర్వాత అంతటి నాయకుడు తనొక్కడే కనిపిస్తున్నాడు. (జిలుకర శ్రీనివాస్ కు వినమ్రతతతో)