మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు
అమరావతి – మాజీ ఎమ్మెల్యే యరపతి నేని శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తాను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాను తొలి నుంచీ టీడీపీని నమ్ముకుని ఉన్నానని, అవకాశం వచ్చినా రాకున్నా పార్టీని విడిచి పెట్టనని అన్నారు. తాను మాట తప్పే మనిషిని కాదన్నారు.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమన్నారు. తాను ఓడి పోయినా నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే కొందరు పనిగట్టుకుని తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు.
తాను పార్టీని వీడుతున్నానని, అధికార పార్టీ వైసీపీలోకి జంప్ అవుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి ఆలోచన తనకు లేదన్నారు. కష్ట కాలంలో తనను ఆదరించి, పదవి కట్టబెట్టిన పార్టీని ఎలా విడిచి పెడతానని ప్రశ్నించారు.
తాను పుట్టింది టీడీపీ కోసమేనని, చనిపోయేది కూడా ఇందు కోసమేనని సంచలన కామెంట్స్ చేశారు యరపతినేని శ్రీనివాస రావు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.