కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు – ప్రభుత్వ బడులు మరింత బలోపేతం కావడానికి తన వంతు సాయం చేస్తానని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బడులను బాగు చేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. ఏ ఒక్కరు కూడా చదువుకు దూరం కాకూడదని తన అభిమతమన్నారు. ప్రతి ఒక్కరు చదువు కోవాలని కోరారు.
విద్య ఒక్కటే మనిషిని ఉన్నతంగా నిలబెడుతుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వం బడులపై ఎక్కువగా ఫోకస్ పెడుతుందని చెప్పారు. గత ప్రభుత్వం సర్కారు పాఠశాలలను నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేయడం జరుగుతుందని చెప్పారు.
సమయం విలువైనదని, దానిని గుర్తించి చదువుపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు. మునుగోడు మండల పరిధిలోని కొంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో రూ. 30 లక్షలు వెచ్చించి, నూతనంగా నిర్మించిన 3 తరగతి గదులను ప్రారంభించారు.
మరో మూడు తరగతి గదులకూ శంకుస్థాపన చేశారు. గ్రామస్థులు, విద్యార్థుల ఘన స్వాగతం పలికారు రాజగోపాల్ రెడ్డికి. అభివృద్ధి కోసం ఇదే విధంగా సహకారం అందిస్తానని, పెండింగ్ సమస్యలనూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.