బల్లాపూర్ కంపెనీ పునరుద్దరణపై ఫోకస్
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రతినిధులు
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి పాలనా పరంగా దూకుడు పెంచారు. ప్రత్యేకించి పరిశ్రమల ఏర్పాటు, పునరుద్దరణపై దృష్టి సారించారు. ములుగు జిల్లా కమలాపురంలో బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిల్ట్) కంపెనీ ప్రతినిధులు సచివాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్బంగా సీనియర్ అధికారులతో చర్చించారు.
ఇదిలా ఉండగా ఈ మిల్లులో వస్త్రాల తయారీకి ఉపయోగించే కలప గుజ్జు తయారవుతుంది. 2014లో ఈ మిల్లు మూత పడింది. దీనిపై ఆధారపడిన 750 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వీరందరికీ ఉపాధి కల్పించడంతో పాటు స్థానికంగా అర్హులైన వారికి అవకాశం కల్పించే దిశగా ఈ మిల్లును తిరిగి తెరిపించేందుకు సీఎం చొరవ చూపారు.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ తీర్పు ప్రకారం బిల్ట్ కంపెనీ ఆస్తులు ఫిన్ క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధీనంలో ఉన్నాయి. కంపెనీ ఎండీ హార్దిక్ పటేల్, ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సిఇఓ వాదిరాజ్ కులకర్ణితో సమావేశం అయ్యారు. ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలు, సాధ్యా సాధ్యాలను చర్చించారు.
మిల్లును తెరిపించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఫిన్ క్వెస్ట్ బృందాన్ని సూచించారు. అయితే బిల్ట్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఐటీసీ కంపెనీ ఆసక్తి చూపుతోంది.