బాబుపై తప్పుడు ప్రచారం
తగదన్న తెలుగుదేశం
అమరావతి – తెలుగుదేశం పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది. తమ పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి వైసీపీ అవాకులు చెవాకులు పేలుతోందంటూ ఆరోపించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది టీడీపీ.
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి కొలువు తీరాక రాష్ట్రంలో ఆలయాలకు రక్షణ కరువైందని, పూజారులకు భద్రత లేకుండా పోయిందని వాపోయింది. శ్రీరామ జన్మ భూమి ట్రస్టు చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వానం పంపిందని , అందుకే తమ నాయకుడు రాముడి పునః ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లారని తెలిపింది.
దీనిని కూడా రాజకీయం చేయాలని చూడటం మంచి పద్దతి కాదని హితవు పలికింది తెలుగుదేశం పార్టీ. జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగింది. ఆయన వచ్చాక గుళ్లు, పవిత్ర స్థలాలపై దాడులు అధికం అయ్యాయని ఆరోపించింది.
దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడం మంచి పద్దతి కాదని తెలిపింది. రామ తీర్థంలోని రాముడి తలను నరికేసి మూడేళ్లయినా విద్రోహులను ఇంతవరకు పట్టుకోలేదని ధ్వజమెత్తింది టీడీపీ. అందుకే అయోధ్యకు రాకుండా జగన్ మోహన్ రెడ్డి ముఖం చాటేశాడంటూ ఆరోపించింది.