బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లీగల్ సెల్
ప్రకటించిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీపై, నేతలపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారందరికీ న్యాయ పరమైన సలహాలు, సూచనలు , కేసులు వాదించేందుకు ప్రత్యేకంగా పార్టీ తరపు నుంచి లీగల్ సెల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
తప్పుడు కేసులను చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేవలం కార్యకర్తలను కాపాడు కోవడం కోసమే ఓ ట్రస్టును ఏర్పాటు చేస్తామన్నారు. మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీని బలోపేతంపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు కేటీఆర్.
కాంగ్రెస్ అభివృద్ది చేస్తామంటూ మాయ మాటలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. పని చేయడం కంటే ప్రచారంపై ఎక్కువగా దృష్టి పెడితే గెలిచి ఉండే వాళ్లమన్నారు . పోడు పట్టాలు, స్థానికంగా గిరిజనులకు రిజర్వేషన్లను కల్పించినా బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వలేదని వాపోయారు.