మల్లన్న సన్నిధిలో దామోదర
దర్శించుకున్న ఆరోగ్య మంత్రి
శ్రీశైలం – తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ప్రసిద్ద పుణ్య క్షేత్రం శ్రీశైలం మల్లన్న సన్నిధిలో గడిపారు. స్వామి వారికి అభిషేకం చేశారు. మంత్రి దంపతులు స్వామి, అమ్మ వార్లను ఆదివారం ఉదయం దర్శించుకున్నారు.
రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా శ్రీశైలం మల్లన్న దర్శనార్థం విచ్చేసిన మంత్రి దామోదర రాజనర్సింహకు దేవస్థాన కార్యనిర్వాహణధికారి, దేవాలయ అర్చక స్వాములు, సిబ్బంది ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయం ప్రకారం వేద పండితులు ఆశీర్వాదంతో మంత్రి దంపతులకు దర్శనం చేయించారు.
అనంతరం, అమ్మవారి ఆలయం వద్ద గల ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద మంత్రాలు పలుకగా అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. స్వామి, అమ్మవార్ల జ్ఞాపికను ఆలయ కార్యనిర్వహణాధికారి అందించి సత్కరించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. తనకు మల్లన్న అంటే ఎంతో ఇష్టమన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లంగా ఉండాలని ప్రార్థించానని చెప్పారు. రాష్ట్ర సర్కార్ పరంగా సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.