మళ్లీ ఎప్పుడు పుడతావు నాన్నా
తండ్రికి బాలకృష్ణ ఘన నివాళి
హైదరాబాద్ – తెలుగు జాతి ఉన్నంత కాలం నందమూరి తారక రామారావు బతికే ఉంటారని అన్నారు ప్రముఖ నటుడు నట వారసుడు నందమూరి బాలకృష్ణ. జనవరి 18న ఎన్టీఆర్ వర్దంతి. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉండవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తీయించాలని ఆదేశించారు. తనకు కనిపించ కూడదని పేర్కొన్నారు.
దీంతో కొంత ఇబ్బందికరంగా మారింది. ఇదే సమయంలో ఎన్టీఆర్ సీఎం అంటూ కొందరు కార్యకర్తలు నినాదాలు చేయడం కనిపించింది. ఇది పక్కన పెడితే తన తండ్రి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నందమూరి బాలకృష్ణ.
క్రమశిక్షణకు, సమర్థవంతమైన నాయకత్వానికి ప్రతీక ఎన్టీఆర్ జీవితం అన్నారు. తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్తంగా పేరు తీసుకు వచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. ఆయన లేని లోటు పూడ్చ లేనిదన్నారు. అటు సినిమా రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని ఏలిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన ఎక్కడ ఉన్నా ఆత్మ శాంతించాలని కోరారు.