మోసం చంద్రబాబు నైజం
మంత్రి కాకాణి గొవర్దన్ రెడ్డి
అమరావతి – అవినీతి, మోసానికి బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు అని సంచలన కామెంట్స్ చేశారు ఏపీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు జీవిత చరిత్ర తరిచి చూస్తే ఏమీ లేదన్నారు. తన రాజకీయ జీవితమంతా నమ్మక ద్రోహమే తప్ప ఇంకేమీ లేదన్నారు.
తప్పు చేయక పోతే సీబీఐ విచారణకు సిద్దం కావాలని సవాల్ విసిరారు. ఏపీ స్కిల్ స్కామ్, ఫైటర్ నెట్ స్కామ్ కేసులలో ఏ కోర్టు ఊరటనిచ్చిందని ప్రశ్నించారు కాకాణి గోవర్దన్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకు నీతి మంతుడని ఎవరు సర్టిఫికెట్ ఇచ్చారని అన్నారు.
తన వాళ్ల కోసం తప్పితే జనం కోసం బాబు ఏనాడూ పని చేయలేదని ధ్వజమెత్తారు. 14 ఏళ్ల పాలనలో ఒక్కటన్న ప్రజలు మెచ్చుకునే పని ఏమైనా చేశావా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలన్నారు. బాబు పాలన స్వర్ణ యుగం కాదని అది అవినీతి యుగమన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఆయన చేసిన అప్పులను తీర్చలేక , వడ్డీలు కట్టలేక తమ సర్కార్ నానా తంటాలు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేనని ఆరోపించారు.