రామచంద్రయ్య రాం రాం
ఎమ్మెల్సీ పదవికి గుడ్ బై
అమరావతి – ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీకి వలసలు పెరుగుతున్నాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీకి బిగ్ షాక్ తగులుతోంది. ప్రధానంగా టికెట్లు ఈసారి రాని వారంతా పక్క చూపులు చూస్తున్నారు.
మరో వైపు చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేష్ బాబు ఫుల్ ఫోకస్ పెట్టారు ఏపీపై. ఇదిలా ఉండగా తాజాగా సంచలన ప్రకటన చేశారు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య. తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందు వల్లనే అందులో భాగస్వామ్యం కాకూడదనే తాను పార్టీని వీడినట్లు చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. తప్పిదాలను చూసుకునే ఓపిక కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేకుండా పోయిందని మండిపడ్డారు. తాజాగా చోటు చేసుకున్న పరిస్థితులను చెప్పుకునేందుకు కూడా ఛాన్స్ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సి. రామచంద్రయ్య. ఆయన వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తంగా ఒకరి వెంట మరొకరు పార్టీని వీడడం సీఎంకు తలనొప్పిగా మారింది.