రామభద్రాచార్యా కలకాలం వర్ధిల్లు
అయోధ్య తీర్పులో స్వామీజీ కీలకం
ఉత్తరప్రదేశ్ – ఎవరీ రామభద్రాచార్య స్వామీజీ అనుకుంటున్నారా. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆయన గురించి చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం ఆయన చేసిన ప్రయత్నం వల్లనే ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఆస్కారం ఏర్పడింది.
దశాబ్దాలుగా కోర్టులో ఈ సమస్య నానుతూ వచ్చింది. చివరకు స్వామీజీ అంధుడైనప్పటికీ తన ప్రతిభతో ఆధారాలతో సహా ప్రాంగణంలో నిరూపించే ప్రయత్నం చేశారు. ఆయన తెలివితేటలను చూసి ధర్మాసనం విస్మయానికి లోనైంది. ఆ వెంటనే రామ మందిర ప్రారంభోత్సవానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
దీంతో ప్రధాని చేతుల మీదుగా అంగరంగ వైభవంగా శ్రీరాముడి పునః ప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది. కళ్లుండి చూడలేని వాళ్లకు కళ్లు లేకున్నా తన వాక్పటిమతో ఆశ్చర్య పోయేలా చేసిన రామభద్రాచార్య స్వామీజీ ఎంత గొప్పవాడో చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
స్వామీజీ అంధుడు అయినా ఋగ్వేదం లోని శ్రీరాముడికి చెందిన 157 మంత్రాలు, వాటికి భాష్యాలు కోర్టులో చెప్పారు. రుగ్వేద మంత్రాలకు పదవాక్య ప్రమాణజ్ఞుడయిన శ్రీ నీలకంఠ పండితుడు రాసిన భాష్యం మంత్ర రామాయణం.
ఇతని తండ్రి గోవిందసూరి. ఇందులోని 157 రుగ్వేద మంత్రాలకు భాష్యం ఉంది. దీనిలో దశరథుని పుత్ర కామేష్టి నుండి సీతా పృధ్వీ ప్రవేశం వరకు ఉంది. దీనిని రామభద్రాచార్య స్వామి అలవోకగా వినిపించే ప్రయత్నం చేశారు. ఈయన ఒక మఠానికీ అధిపతి.
రామజన్మభూమి గురించి కోర్టులో వాదాలు జరుగుతున్నప్పుడు జడ్జీలలో ఒక జడ్జి హిందువులు అన్నింటికి వేదం ప్రమాణం అంటారు కదా చెప్పమని అడిగారు. రామభద్రాచార్య స్వామి అక్కడికి వచ్చారు. అంధుడైనా అలవోకగా అనర్ఘళంగా రుగ్వేద మంత్రాలు చదివారు. వాటికి భాష్యం చెప్పారు. రామ కథను వివరించారు. కోర్టు ప్రాంగణమంతా నిశ్శబ్దంగా మారి పోయింది. న్యాయమూర్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. చివరకు తుది తీర్పు వెలువరించారు.