రేవంత్ అబద్దాలకు కేరాఫ్
నిప్పులు చెరిగిన కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దావోస్ పర్యటనకు వెళ్లి ఏం చేసి వచ్చారో చెప్పాలన్నారు. రైతు భరోసా ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు.
గురువారం ప్రగతి భవన్ లో మీడియాతో చిట్ చాట్ మాట్లాడారు. విదేశీ టూర్ లో పచ్చి అబద్దాలు తప్ప ఒక్క నిజం చెప్పలేదన్నారు. రూ. 40 వేల కోట్లు బక్వాస్ అంటూ కొట్టి పారేశారు. రైతు భరోసాను ఇంకా ప్రారంభించకుండా ఎలా వేస్తారంటూ నిలదీశారు కేటీఆర్.
రైతు బంధు ఏది అడిగిన పాపానికి రైతులపై దుర్భాష లాడుతున్నారని ఇదేనా కాంగ్రెస్ పాలనా అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతాంగానికి మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉన్న రైతు బంధు ఇవ్వకుండా లేని రైతు భరోసా గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. జనం లోక్ సభ ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు.
ఈ 45 రోజుల పాలనలో రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. కేవలం తన పనులు చక్క పెట్టుకోవడం తప్ప అని ఎద్దేవా చేశారు. తెలంగాణ పాలన ఢిల్లీ నుంచి సాగుతోందని ధ్వజమెత్తారు కేటీఆర్. కొత్తగా సీఎం క్యాంపు కార్యాలయం ఎందుకో చెప్పాలన్నారు.