బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని సీఎం అని ఎద్దేవా చేశారు. దావోస్ , లండన్ కు వెళ్లి అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదన్నారు.
సీఎం పదవికి రేవంత్ రెడ్డి అనర్హుడని పేర్కొన్నారు. సభ్య సమాజం ఆయనను చూసి తెలంగాణ ప్రజలు తల దించు కుంటున్నారని ఆరోపించారు. ఎవరు భిల్లా రంగా ఈ సమాజానికి తెలుసన్నారు. పనిగట్టుకుని తెలంగాణ సాధించుకుని తీసుకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ ను పట్టుకుని వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమన్నారు.
రాష్ట్ర సాధన కోసం 18 ఏళ్ల పాటు అహర్నిశలు కృషి చేసిన వాస్తవం అందరికీ తెలుసన్నారు. సీఎం స్థాయికి తగడని పేర్కొన్నారు. గల్లీ లీడర్ లాగా మాట్లాడటం మానుకోవాలని సూచించారు. సోయి తప్పి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు.
చిల్లర మల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. సీఎం పదవి అనేది అత్యున్నతమైనదని , దాని గురించి కూడా ఆలోచించకుండా సంస్కారం లేకుండా మాట్లాడటం మంచిది కాదన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. దేశంలోని అన్ని పార్టీలను ఏకతాటి పైకి తీసుకు వచ్చిన ఘనత మాజీ సీఎంది అన్నారు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్.