లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుతాం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
న్యూఢిల్లీ – త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీలతో ఏఐసీసీ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే దిశా నిర్దేశం చేశారని తెలిపారు. సమావేశం అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
అత్యధిక స్థానాలు గెలుపొందేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని ఆ మేరకు క్షేత్ర స్థాయిలో పని చేస్తామని చెప్పారు . ఏఐసీసీతో తెలంగాణ లోక్ సభ ఇన్ ఛార్జ్ లు భేటీ అయ్యారని , ఇందులో అందరూ పాల్గొన్నారని తెలిపారు. అయితే పార్టీ గెలుపొందడం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధిష్టానం దిశా నిర్దేశం చేస్తుందన్నారు మల్లు భట్టి విక్రమార్క.
ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించినట్లే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించి తీరుతారని జోష్యం చెప్పారు. ఇదే సమయంలో సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయాలని ఏఐసీసీని కోరామని వెల్లడించారు డిప్యూటీ సీఎం. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇండియా కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని, అధికారాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.