ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా
తమిళనాడు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు, డీఎండీకే చీఫ్ విజయకాంత్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. ఇటీవలే ఆయన తీవ్ర అనారోగ్యంతో కన్ను మూశారు. లక్షలాది మంది విజయకాంత్ కు అభిమానులు ఉన్నారు. నటుడిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎక్కడా రాజీ పడలేదు. తనదైన శైలితో సేవా కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు.
ఈ సందర్బంగా తమిళనాడులోని విజయకాంత్ కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి ఆర్కే రోజా, భర్త ప్రముఖ నిర్మాత సెల్వమణి. విజయకాంత్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విజయకాంత్ భార్య ప్రేమలత, తనయులకు ధైర్యం చెప్పారు.
అనంతరం ఆయనతో ఉన్న జ్ఞాపకాలను దర్శకుడు సెల్వమణి, నటి రోజా నెమరు వేసుకున్నారు. సెల్వమణి దర్శకత్వంలో విజయకాంత్ నటించారు. ఆయన తీసిన కెప్టెన్ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఆ ఒక్క మూవీతోనే విజయకాంత్ ను అందరూ కెప్టెన్ అంటూ సంబోదించడం ప్రారంభించారు. విజయకాంత్ , రోజా కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. పలు చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఈ సమయంలో నటుడు లేక పోవడం బాధాకరమని అన్నారు సెల్వమణి.