విద్యార్థులతో నారా లోకేష్ ముఖాముఖి
చంద్రంపాలెం పాఠశాల సందర్శన
విశాఖపట్నం జిల్లా – విద్యార్థులతో ముచ్చటించారు విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్. శుక్రవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా విశాఖలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు నారా లోకేష్. పాఠశాలలో ఆటస్థలం అస్తవ్యస్తంగా ఉందని గుర్తించారు. క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి.
మధ్యాహ్న భోజనం ఎలా ఉందని ఆరా తీశారు. పాఠశాలలో అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను గమనించారు. పాఠశాలలో తాగునీరు అందించడంతో పాటు మరుగుదొడ్లలో నీటి సరఫరా మెరుగు పర్చాలని ఆదేశించారు నారా లోకేష్.
రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట విజయవంతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు మంత్రి. చంద్రంపాలెం జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్యా రంగాన్ని గత ప్రభుత్వం గాలికి వదిలి వేసిందని అన్నారు.
తమ ప్రభుత్వం వచ్చాక పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు .