విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
నినదించిన కాంగ్రెస్ పార్టీ
విశాఖపట్నం – ముమ్మాటికీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయొద్దంటూ గత కొన్ని నెలలుగా నిరసన దీక్ష చేపట్టారు. దీనిపై ప్రముఖ వ్యాపార వేత్త అంబానీ కన్నేశారనే ఆరోపణలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల ఆదాయం దీని ద్వారా సమకూరనుంది. అయినా కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో ఈ అంశం ముందుకు వచ్చింది.
ఆందోళన చేపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ కార్మికులకు, నేతలకు , సంఘాలకు పూర్తిగా సంఘీ భావం ప్రకటించారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ సందర్బంగా వారిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. నష్టాల పేరు చెప్పి ప్రైవేటీకరణ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
లాభాల్లో ఉన్న ప్రాజెక్టను అమ్ముతున్నారంటే సిగ్గు పడాలని అన్నారు వైఎస్ షర్మిల. కష్టం వస్తే ప్రజలు ప్రభుత్వానికి చెప్పుకుంటారు కానీ ఇక్కడ ప్రభుత్వమే పెద్ద దొంగ నాటకం ఆడుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
ఇక్కడ ఉన్న జింక్ ఫ్యాక్టరీని వేదాంత కంపెనీకి ఇచ్చారని, అది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కానివ్వమని హెచ్చరించారు.
ఉద్యోగాలు రాని 8 వేల మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పించేలా పోరాటం చేస్తామని ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని మ్యానిఫెస్టోలో కూడా చేర్చ బోతోందని తెలిపారు.