మంత్రి పెద్దిరెడ్డిపై గరం గరం
అమరావతి – ఏపీలో అధికార పార్టీకి కోలుకోలేని షాక్ తగులుతోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుండగా తాజాగా సంచలన వ్యాఖ్యలకు తెర లేపారు వైసీపీకి చెందిన సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
సోషల్ మీడియా వేదికగా ఫేస్ బుక్ లైవ్ లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్ వల్ల తన ప్రాంతానికి జరిగిన మేలు ఏమీ లేదన్నారు. ప్రధానంగా తమ వాటా నీళ్ల కోసం యుద్దం చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు జొన్నలగడ్డ పద్మావతి.
ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి సమస్య గురించి విన్నవించినా, పలుమార్లు చెప్పినా పట్టించు కోలేదని మండిపడ్డారు. ఏనాడూ నీటి సమస్యను పరిష్కరించ లేదని వాపోయారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో ప్రజల వద్దకు ఏమని పోవాలని ప్రశ్నించారు.
ఎస్సీలకే ఎందుకు అన్యాయం జరుగుతోందని నిలదీశారు ఎమ్మెల్సీ. ఎస్సీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని ఉండాలా అని మండిపడ్డారు జొన్నలగడ్డ పద్మావతి. అలా అయితేనే నిధులు విడుదల చేస్తారా, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు వేస్తేనే తాను ఎమ్మెల్యే కాలేదన్నారు. కుల , మతాలకు అతీతంగా తనను సింగనమల ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు . సీఎం జగన్ పెద్దిరెడ్డి చెప్పినట్టే నడుచుకుంటున్నారని ఆరోపించారు.