సత్తా చాటుదాం విజయం సాధిద్దాం
పిలుపునిచ్చిన తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో అభివృద్ది జరిగిందని, కానీ ఎందుకనో ప్రజలు ఆదరించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో నాగర్ కర్నూల్ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తన్నీరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గతంలో జరిగిన అన్ని సమావేశాల కంటే ప్రస్తుతం జరిగిన కీలక మీటింగ్ లో ఎక్కువగా సూచనలు, సలహాలు వచ్చాయని అన్నారు. కార్యకర్తలు ఏది కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరిగి తీరుతుందన్నారు. ప్రభుత్వం మాయ మాటలు చెప్పి పవర్ లోకి వచ్చిందని ఆరోపించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రాంత అభివృద్ది కోసం రేయింబవళ్లు కష్ట పడ్డామని, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో తడబాటుకు గురయ్యామని ఆవేదన చెందారు. అయినా అధైర్య పడాల్సిన పని లేదన్నారు తన్నీరు హరీశ్ రావు. పార్టీ స్థానం మారిందని, ప్రతిపక్షంలోకి వచ్చామని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మన బీఆర్ఎస్ పార్టీకి మధ్య వచ్చిన ఓట్ల శాతం కేవలం ఒక శాతం మాత్రమేనని గుర్తు పెట్టుకోవాలన్నారు.
సోషల్ మీడియానే మన కొంప ముంచిందన్నారు. పదేళ్ల పాటు అద్భుతమైన పాలనను అందించిన ఘనత మనదేనని అన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారని దానిని మనం గౌరవించాలని అన్నారు హరీశ్ రావు.