సమాచారశాఖ అక్రమాలపై ఆరా
వివరాలు ఇవ్వాలని సీఎం ఆదేశం
హైదరాబాద్ – రాష్ట్రంలో గతంలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చేసింది. అన్ని రంగాలలో అవినీతి, అక్రమాలు ఇబ్బడి ముబ్బడిగా చోటు చేసుకున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై దృష్టి సారించింది. ఈ మేరకు అన్ని శాఖలను స్వయంగా సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రచారానికి అడ్డగోలుగా ప్రజల డబ్బులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. విచిత్రం ఏమిటంటే ఇది కల్వకుంట్ల కుటుంబం వ్యక్తిగత ప్రచారానికి, అంతే కాకుండా బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ చేసుకునేందుకు పనికి వచ్చిందన్న విమర్శలు ఉన్నాయి.
దీంతో ప్రత్యేకంగా రాష్ట్ర పౌర సంబంధాల, సమాచార శాఖపై సమీక్షించారు రేవంత్ రెడ్డి. ఇందులో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. వెంటనే పూర్తి వివరాలు తనకు అందజేయాల్సిందిగా ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వ పరంగా అడ్డగోలుగా ప్రకటనలు, సోషల్ మీడియాలో రీల్స్ చేసిన వాళ్లకు కూడా కోట్లల్లో చెల్లింపులు చేసినట్లు తేట తెల్లమైంది. బీఆర్ఎస్ పాలనలో గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2023 వరకు వివిధ ప్రకటన రూపంలో ఏకంగా రూ. 350 కోట్లు ఖర్చు చేసినట్లు తేలింది.