పెట్టుబడుల గురించి వివరణ
హైదరాబాద్ – ప్రముఖ అంతర్జాతీయ లాజిస్టిక్ కంపెనీ అమెజాన్ ప్రతినిధులు బుధవారం సీఎం రేవంత్ రెడ్డితో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణలో పెట్టుబడుల గురించి అమెజాన్ ప్రతినిధులు సీఎంకు వివరించారు. తమ కంపెనీ ఆధ్వర్యంలో పెట్టుబడుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వందలాది మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. అంతే కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.
ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. తమ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు సుముఖంగా ఉందన్నారు. ఇప్పటికే కొలువు తీరిన కంపెనీలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.
పెట్టుబడి పెట్టేందుకు ఎవరు వచ్చినా తాము స్వాగతం పలుకుతామని తెలిపారు. ప్రత్యేకించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను, యూనివర్శిటీలను ఏర్పాటు చేస్తామని మరోసారి పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా తాము హైదరాబాద్ కు ప్రయారిటీ ఇవ్వడం జరిగిందని అమెజాన్ ప్రతినిధులు వెల్లడించారు.