సీఎంతో మైక్రాన్ కంపెనీ సీఈవో భేటీ
ప్రభుత్వ సహకారం అందిస్తుంది
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బిజీగా మారారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీల ప్రతినిధులు, బాధ్యులు ఆయనను కలుస్తున్నారు. తాము కూడా రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తామని పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి పెద్ద మెమోరీ చిప్స్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్ , సీఈవో సంజయ్ మోహ్రోత్రా సీఎంతో భేటీ అయ్యారు.
ఆయన ప్రత్యేకంగా అమెరికా నుంచి రేవంత్ రెడ్డిని కలిసేందుకు వచ్చారు. సీఎంను ఆయన నివాసంలో కలుసుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలమైన వాతావరణం ఉందని ఈ సందర్బంగా సంతోషం వ్యక్తం చేశారు సీఈవో సంజయ్ మెహ్రత్రా.
ఇదిలా ఉండగా సిఇవోకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. మైక్రాన్ ఆసక్తి చూపితే ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. వీలైతే మీకు కావాల్సిన విధంగా పారిశ్రామిక పాలసీలో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.
పరిశ్రమల స్థాపన, నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని రేవంత్ రెడ్డి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
అమెరికాకు చెందిన ఈ సంస్థ సెమీ కండక్టర్ల తయారీలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కంపెనీ. మెమరీ చిప్స్ తయారు చేసే సంస్థల్లో అతి పెద్దది కావడం విశేషం.