సుప్రీం తీర్పు చెంపపెట్టు
చరిత్రాత్మకం సంచలనం
శాసన వ్యవస్థల పనితీరు బాగోలేనప్పుడు న్యాయ వ్యవస్థ మూడో కన్ను తెరవక తప్పదు. ప్రతి సందర్బంలో ఇది వర్తిస్తుందని అనుకోలేం. ఇందుకు ఆయా కాలాల పరిస్థితుల మేరకు నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. 140 కోట్లకు పైగా జనాభా కలిగిన అతి పెద్ద ప్రజాస్వామిక భారత దేశంలో సర్వోన్నత న్యాయ స్థానం ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయనేది కొంత ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆలోచింప చేస్తాయి కూడా. చట్టం ముందు అందరూ సమానమే అని చెబుతున్నా ఆచరణలోకి వచ్చే సరికల్లా కులం, ప్రాంతం, బంధు ప్రీత, ఆశ్రిత పక్షపాతం, అధికార జులం అన్ని వైపులా మొనదేరిన కత్తుల్లా పొడిచేందుకు సిద్దంగా ఉంటాయి. ఈ మధ్యన సీజేఐగా జస్టిస్ ధనంజయ చంద్రచూడ్ కొలువు తీరాక కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొలిజియంపై చర్చోప చర్చలు, వాదోప వాదనలు చోటు చేసుకున్నాయి. న్యాయ వ్యవస్థ వర్సెస్ శాసన వ్యవస్థ మధ్య ఎవరిది ఆధిపత్యం అనేది కూడా ప్రస్తావనకు వచ్చింది.
ఇదే అంశం ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్ల నియామకంపై సీజేఐ ధర్మాసనం పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ సైతం నోరు జారారు. దేశానికి ప్రతినిధులుగా ఉన్న వారు, బాధ్యతాయుతమైన పదవులను నిర్వహిస్తున్న వారు ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిది. లక్ష్మణ రేఖ అనేది ప్రతి రంగానికి ఉంటుంది. దానిని దాటకుండా ఉండడమే కావాల్సింది. తాజాగా ఆనాటి గోద్రా ఘటనకు సాక్షీభూతంగా ఉన్న బిల్కిస్ బానో కేసుకు సంబంధించి చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. జస్టిస్ నాగరత్న, జస్టిస్ భూయన్ తో కూడిన ధర్మాసనం చెంప పెట్టు లాంటి తీర్పు చెప్పింది. ఒక రకంగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ, బీజేపీ సంకీర్ణ సర్కార్ కు బిగ్ షాక్.
2002 గుజరాత్ లో చోటు చేసుకున్న మారణ కాండలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురైంది. తన కళ్ల ముందే తన వారిని మట్టుబెట్టారు. తమ కోరికను తీర్చుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. జీవిత ఖైదు విధించారు. విచిత్రం ఏమిటంటే బీజేపీ గుజరాత్ సర్కార్ 11 మంది దోషులకు క్షమాభిక్ష ప్రసాదించింది. బయటకు తీసుకు వచ్చింది. వారికి ఘన స్వాగతం పలికింది. ఒక మహిళను రేప్ చేస్తే ఈ దేశంలో గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన ఘటన ఒక్క మోదీ హయాంలో జరగడం విస్తు పోయేలా చేసింది. వారిని రిలీజ్ చేయడాన్ని తప్పు పట్టింది బాధితురాలు. ఆమెతో పాటు మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది.
ఆ దోషులను విడుదల చేయాలన్న గుజరాత్ సర్కార్ నిర్ణయాన్ని కొట్టి వేసింది. ఈ సందర్బంగా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఒక మహిళ సమాజంలో ఎంత ఉన్నతమైనా లేదా తక్కువైనా గౌరవం పొందాలి. ఆమె అనుసరించే విశ్వాసం లేదా ఆమె ఏ మతానికి చెందిన వారైనా గౌరవం పొందాలి. మహిళలపై జరిగిన క్రూరమైన నేరాలు ఉపశమనాన్ని అనుమతించ వచ్చా అని నిలదీసింది. 2022 మేలో జస్టిస్ రస్తోగి ఇచ్చిన తీర్పుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ నాటి తీర్పు పూర్తిగా మోస పూరిత మార్గాల ద్వారా, వాస్తవాలను తొక్కి పెట్టడం ద్వారా ఇచ్చారని మండిపడింది. ఈ సంచలన తీర్పు కేంద్ర సర్కార్ కు చెంప పెట్టు లాంటిదని చెప్పక తప్పదు.