హీటెక్కిన పాలిటిక్స్ ఎవరిదో సక్సెస్
ఏపీలో నాలుగు స్తంభాలాట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఆయా పార్టీలు మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఒకరిపై మరొకరు దూషణలకు తెర లేపారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ బాస్ , సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలు సవాల్ గా మారాయి. ఎలాగైనా సరే రెండోసారి అధికారంలోకి రావాలని శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది నుంచే కింది స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలన్నీ ఆయన కనుసన్నలలోనే జరుగుతున్నాయి. తెలంగాణలో అన్నీ తానై వ్యవహరించి, ఏక ఛత్రాధిపత్య పాలన సాగించిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు ప్రజలు. దీంతో ఆయన పదవిని కోల్పోయారు. ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. ఈ తరుణంలో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.
దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేశారు. ప్రధానంగా విద్యా, ఆరోగ్య రంగాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇదే సమయంలో అన్ని వర్గాల వారిని ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వనరులను అదానీ లాంటి బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసు దమనకాండ , వైసీపీ నేతల ఆగడాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు మూడు రాజధానుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ అంశాలే ప్రధానంగా ఓట్లను కోల్పోయేందుకు ఆస్కారం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది పక్కన పెడితే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్థాన భ్రంశం కల్పించడం ఒకింత పార్టీపై ప్రభావం చూపనుంది.
ఇక ప్రతిపక్షాలైన తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన , భారతీయ జనతా పార్టీ, వామపక్షాలు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నాయి. ప్రధానంగా పోటీ జగన్ మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల మధ్య నెలకొంది. ఇక భారతీయ జనతా పార్టీకి చీఫ్ గా ఉన్న సోమూ వీర్రాజును తప్పించి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించింది. దీంతో బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతుందని, ప్రభావితం చేస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇక జగన్ మోహన్ రెడ్డికి స్వయాన చెల్లెలు అయిన వైఎస్ షర్మిలా రెడ్డి ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఒకింత విస్మయానికి గురి చేసింది. దీనిపై ఆ పార్టీ గొంతుకగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో ఎవరి పంథా..ఎవరి దారి వారిదేనని కుండ బద్దలు కొట్టారు. మరో వైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తు బాట పట్టారు. వీలైతే బీజేపీని కూడా కలుపు కోవాలని పవన్ భావిస్తున్నారు.
అయితే బీజేపీ వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది. షర్మిల భారీ ఎత్తున ఓట్లను చీల్చే ఛాన్స్ లేక పోలేదని ప్రచారం జరుగుతోంది. ఆమెకు పార్టీ పగ్గాలు ఇస్తారని కూడా టాక్. బాబు, పవన్ కూటమి ఈసారి పవర్ లోకి రావాలని శత విధాలుగా యత్నిస్తోంది. జగన్ ను టార్గెట్ చేస్తూ ముందుకు వెళుతోంది. బాబు జైలు పాలు కావడం తిరిగి బెయిల్ పై రావడంతో కొంత వ్యతిరేకత వైసీపీ ఉందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రకు జనాదరణ లభించింది. ఇది కూడా టీడీపీలో జోష్ తెచ్చేలా చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకుకు ఢోకా లేదని అనుకుంటోంది. పాత, కనుమరుగైన నేతలంతా తిరిగి స్వంత గూటికి చేరేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ పార్టీకి ఇటు తెలంగాణలో అటు కర్ణాటకలో పవర్ లోకి రావడంతో ఏపీలో కూడా సత్తా చాటాలని ఏఐసీసీ దిశా నిర్దేశం చేస్తోంది. ప్రత్యేక హోదా హామీతో ముందుకు వస్తోంది. ఇక వామపక్షాలు ఇండియా కూటమిలో ఉండడంతో మొత్తంగా ఏపీలో నాలుగు స్తంభాలట మొదలైందని చెప్పక తప్పదు.