త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా
హైదరాబాద్ – మాజీ ఎంపీ, ప్రముఖ మాజీ క్రికెటర్ మహమ్మద్ అజాహరుద్దీన్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా. అవుననే ప్రచారం జోరందుకుంది. ఆయన తాజాగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఓటమి పాలయ్యారు. ఇదే సమయంలో క్రికెట్ ను బలోపేతం చేయడంలో, పార్టీ కోసం 18 ఏళ్లుగా పని చేశారు. అయినా తనను పక్కన పెట్టి ఎమ్మెల్సీగా మీర్ అమీర్ అలీ ఖాన్ ను ఎంపిక చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల హైకమాండ్ తనకు స్పష్టమైన హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ ఇస్తానని , కానీ మీర్ కు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు అజహరుద్దీన్. పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా వేరే వారికి ఎలా ఇస్తారంటూ నిలదీశారు. ఇదిలా ఉండగా ఏఐసీసీ పెద్దలతో మాట్లాడతానని అన్నారు. ఆ తర్వాత తాను నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు మాజీ క్రికెటర్.
గతంలో అజహరుద్దీన్ క్రికెటర్ గా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. కేసు కూడా నమోదైంది. కానీ ఎమ్మెల్యేగా ఓడి పోవడం ఆయనను కుంగి పోయేలా చేసింది.