చూస్తే చిన్నోడు టెక్నాజీలో దమ్మున్నోడు
విస్తు పోయేలా చేసిన ఏపీ కుర్రాడు అఖిల్
హైదరాబాద్ – నేర్చు కోవాలన్న తపన, సాధించాలన్న కోరిక బలంగా ఉంటే వయసుతో పనేముంది. కొండల్ని పిండి చేయొచ్చు. అనుకున్నది సాధించేయొచ్చు. పొద్దస్తమానం సెల్ ఫోన్లతో ఆటాలుడుకునే పిల్లలను చూశాం. కానీ 11 ఏళ్ల వయసులోనే టెక్నాలజీలో అనుభవం సంపాదించడమే కాదు కీలకమైన అంశాలలో మంచి పట్టు సాధించాడు తెలుగు కుర్రాడు అఖిల్ ఆకెళ్ల. తన స్వస్థలం ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం యుకె లో ఉంటున్నాడు. ఓ వైపు చదువుకుంటూనే కీలకమైన విభాగాలకు సంబంధించి కోర్సులు పూర్తి చేశాడు. సర్టిఫికెట్లు అందుకున్నాడు. అందరినీ విస్తు పోయేలా చేశాడు అఖిల్ ఆకెళ్ల.
ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించే సర్టిఫైడ్ అజూర్, డేటా, సెక్యూరిటీ, ఏఐ ఫౌండేషన్ సర్టిఫికేషన్ లను పూర్తి చేశాడు అఖిల్ ఆకెళ్ల. అంతే కాదు యుకె లో జరిగే టెక్ సమ్మిట్ లకు తరుచూ హాజరవుతుంటాడు. సీనియర్ లీడర్లతో మీట్ కావడం, వారితో సంభాషించడం, టెక్నాలజీ పరంగా తనకు ఉన్న సమస్యలను ఏకరువు పెట్టడం, అనుమానాలను నివృత్తి చేసుకోవడం పనిగా పెట్టుకున్నాడు అఖిల్ ఆకెళ్ల.
అంతే కాదు ఇంగ్లండ్ లో తాను ఉంటున్న వీధిలో ఏఐ టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేలా చేశాడు. దీంతో రోడ్స్ పోలీసింగ్ లీడ్ , రోడ్ సేఫ్టీ లీడ్, కెమెరా ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బంది, సేఫర్ నైబర్ హుడ్ టీం , యూత్ ఎంగేజ్ మెంట్ టీం సభ్యులు అఖిల్ ఆకెళ్లను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్బంగా అత్యంత ప్రతిభావంతుడైన చిన్నోడంటూ కితాబు కూడా ఇచ్చేశారు.
తాజాగా తనను ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీలోని అమరావతిలో టెక్ ల్యాండ్ స్కేప్ ను పెంచేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశాడు అఖిల్ ఆకెళ్ల. దీని ద్వారా పలు కంపెనీలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాడు. మీరు మద్దతు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తానంటూ ఏకంగా ఏపీ మంత్రి నారా లోకేష్ కు ట్వీట్ చేశాడు. ఆయన అఖిల్ ఆకెళ్ల కోరికను, ప్రతిభను ప్రశంసించాడు. తనను కలవాలని సూచించారు. మొత్తం మీద విలువైన కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఈ చిన్నోడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదూ. భవిష్యత్తులో మరింతగా ఎదగాలని కోరుకుందాం.