ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్
పట్టుమని 14 ఏళ్లు. అయినా ఎక్కడా తగ్గలేదు. బెదరలేదు. స్టార్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఎదుర్కొన్నది 20 బంతులు మాత్రమే . చేసింది 34 రన్స్. తను ఉన్నంత వరకు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు ఏమీ తోచ లేదు. ఓ వైపు జైశ్వాల్ , ఇంకో వైపు వైభవ్ సూర్యవంశీ ఉతికి ఆరేశారు. అయినా చివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ కీలక పోరులో 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది రాజస్థాన్ రాయల్స్. ప్లే ఆఫ్స్ కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది . ఈసారి టోర్నీలో ఏదీ కలిసి రాలేదు ఈ జట్టుకు. ప్రధాన స్టార్ ప్లేయర్ , స్కిప్పర్ సంజూ శాంసన్ గాయపడడం, ప్రధాన ఆటగాళ్లను వేలం పాటలో వదులు కోవడం జట్టుకు శాపంగా మారింది. మొత్తంగా వైభవ్ సూర్యవంశీ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
తన కెరీర్ లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ గా మలిచి ఔరా అని పించేలా చేశాడు. అంతే కాదు అవేశ్ ఖాన్ కు చుక్కలు చూపించాడు. భారీ సిక్స్ కొట్టాడు. తన దూకుడు చూస్తే ఈ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేస్తాడని అనుకున్నారంతా. కానీ మార్కరమ్ బౌలింగ్ లో షాట్ కొట్టేందుకు ముందుకు రావడంతో తెలివిగా పంత్ స్టంపింగ్ చేయడంతో పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన నితీశ్ రాణాను 8 రన్స్ కే యశ్ ఠాకూర్ ఔట్ చేశాడు. రియాన్ పరాగ్ 39, జైశ్వాల్ 74 రన్స్ చేసినా చివరి ఓవర్ లో 9 రన్స్ చేయలేక చేతిలో వికెట్లను పెట్టుకుని చేజేతులారా మ్యాచ్ ను కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.