ఏప్రిల్ నెలలో భక్తుల సంఖ్య 20.17 లక్షలు
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక ప్రకటన చేసింది. గత ఏప్రిల్ నెలలో తిరుమల పుణ్య క్షేత్రాన్ని 20. 17 లక్షల మంది భక్త బాంధవులు దర్శించుకున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి తెలిపారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు.
భక్తులు నిత్యం స్వామి, అమ్మ వార్లకు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా గత నెలకు సంబంధించి రూ. 101.63 కోట్లు ఆదాయంగా వచ్చినట్లు స్పష్టం చేశారు. స్వామి వారి ప్రసాదం లడ్డూలను 94.22 లక్షల లడ్డూలు విక్రయించినట్లు పేర్కొన్నారు.
ఇక ఏప్రిల్ నెలలో తిరుమలలో అన్న ప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 39.73 లక్షలు ఉన్నారని తెలిపారు. స్వామి వారికి సంబంధించి నిత్యం సమర్పించే తలనీలాలను 8.08 లక్షల మంది సమర్పించారని వెల్లడించారు భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మా రెడ్డి.
ఇదిలా ఉండగా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థులకు సెలవులు ప్రకటించడంతో భారీ ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారని తెలిపారు.