ప్రకటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ – హైదరాబాద్ లో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడం జరిగిందన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. హైడ్రా ఏర్పడి 5 నెలలైందని, కొత్త ఏడాదిలో రూట్ మ్యాప్ సిద్దం చేశామన్నారు. ఓఆర్ఆర్ వరకు హైడ్రా పరిధి ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దీనికి చైర్మన్ గా ఉంటారని చెప్పారు. 12 చెరువులు, 8 పార్కులు అన్యాక్రాంతం కాకుండా కాపాడడం జరిగిందన్నారు కమిషనర్.
ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. జీహెచ్ ఎంసీ చట్ట సవరణ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక అధికారులు హైడ్రాకు ఇచ్చామని తెలిపారు. హైడ్రా చర్యలతో ఎఫ్ టీఎల్ , బఫర్ జోన్ పై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు.
1095 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్ టీఎల్ నిర్దారణ చేస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, డాటాతో ఎఫ్ టీఎల్ నిర్దారణ చేపడతామని పేర్కొన్నారు. ఎఫ్ టీఎల్ ను పారదర్శకంగా చేయడం తమ బాధ్యత అని పేర్కొన్నారు కమిషనర్.
శాటిలైట్ ఇమేజ్ తో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నామని చెప్పారు. ఎఫ్ టీఎల్ మారడానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తుందన్నారు. శాస్త్రీయమైన పద్దతుల్లోనే ఎఫ్ టీఎల్ నిర్దారణ జరుగుతుందన్నారు.
నాలాలపై వివిధ సంస్థలు చేసిన స్టడీని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. 5800 ఫిర్యాదులు హైడ్రాకు అందాయన్నారు. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపారక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
27 పురపాలక సంఘాలపై కూడా తమకు అధికారం ఉందని, శాటిలైట్ ఇమేజ్ ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నామని ఏవీ రంగనాథ్ చెప్పారు. చెరువుల్లో భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్ పై కుడా దృష్టి పెట్టామన్నారు.
2025 లో జియో ఫెన్సింగ్ సర్వే చేయబోతున్నామని ప్రకటించారు. 12 చెరువుల పునరుద్దరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు.