
జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ -1 పరీక్షలకు సంబంధించి సంచలన తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు. దీనిపై స్పందించారు. తనను కలిసిన అభ్యర్థులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. గ్రూప్-1 అవకతవకలపై జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆకాంక్షల మేరకు తప్పకుండా తిరిగి పరీక్ష నిర్వహించాలని కోరారు. హైకోర్టు కమిషన్ గుర్తించినట్లుగా అవకతవకలు జరిగాయనే విషయాన్ని ప్రభుత్వం అంగీకరించాలన్నారు. బేషజాలకు పోతే చివరకు చీవాట్లు తినాల్సి వస్తుందన్నారు కేటీఆర్. టీఎస్పీఎస్సీ అవినీతి, పరీక్షల అస్తవ్యస్త నిర్వహణపై మండిపడ్డారు.
సిట్టింగ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జి (లేదా రిటైర్డ్ జడ్జి) ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు . ఈ వ్యవహారంలో అన్యాయం చేసిన బ్రోకర్లు, దోషులు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు ఉద్యోగాలు అమ్ముకున్నారో, ఎక్కడ తప్పులు జరిగాయో స్పష్టత కావాలన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలో ప్రజలకు తేల్చాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని కోరారు కేటీఆర్. నిరుద్యోగులు, విద్యార్థుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ , ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించాలన్నారు.