
రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు . ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని, ఎవరిపై ఆధార పడకుండా చూడాలని జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. మిగిలి పోయిన ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు మంత్రి నిమ్మల రామానాయుడుకు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో 38,457 చెరువులకు గాను 32,642 చెరువులను ఇంకా పూర్తిగా నింపాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హెచ్ఎన్ఎస్ఎస్ పరిధిలోని 497 చెరువులకు గాను 51 చెరువులు పూర్తిగా నిండాయని తెలిపారు. అన్ని చెరువులు వీలైనంత త్వరగా నింపగలిగితే హెచ్ఎన్ఎస్ఎస్ పరిధిలోని 89,117 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే రూ.6,518 కోట్ల వ్యయమయ్యే ప్రాధాన్య ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని సూచించారు. దీనిద్వారా 2,81,139 ఎకరాలకు కొత్తగా సాగునీరు ఇవ్వడంతో పాటు, 3,38,326 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం సాధ్యపడుతుందన్నారు.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, బొడ్డేపల్లి రాజగోపాల రావు వంశంధార ప్రాజెక్ట్, సర్దార్ గౌతు లచ్ఛన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్, తారకరామ తీర్థ సాగరం రిజర్వాయర్ ప్రాజెక్ట్, గాలేరు నగరి సుజల స్రవంతి పనుల పురోగతిపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. గాలేరు నగరి సుజల స్రవంతి 108 కి.మీ. మేర పూర్తి చేసి కడప వరకు నీటిని తీసుకు వెళ్లేలా, పనులు నిలిచిన చోట్ల మళ్లీ టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. రూ.1,686 కోట్లతో చేపట్టిన శ్రీశైలం డ్యామ్ రక్షణ పనులు, ఎస్కేప్ చానల్ పనులు శరవేగంగా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనీ సూచించారు.