బీఆర్ఎస్ సీనియర్ నేత వద్దిరాజు
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్ అనేలా బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిందని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు తప్పా నిజంగా బీసీలపై ప్రేమ మాత్రం కానే కాదని, ఇదంతా రాజకీయ డ్రామా అని మండిపడ్డారు. అమలు కాదని తెలిసి కూడా మోసపూరిత జీఓ తీసుకొచ్చి ఆగం చేశారని వాపోయారు. బీసీల ఆగ్రహ జ్వాలలో కాంగ్రెస్ కూలిపోవడం ఖాయమని జోష్యం చెప్పారు. ముందే తెలుసుకునే ఇలాంటి నాటకానికి తెర లేపారని ఫైర్ అయ్యారు వద్దిరాజు రవిచంద్ర.
ఇప్పటికే కుల గణన పేరుతో బీసీలను మోసం చేశారని, ఇప్పుడు మరో కొత్త నాటకంతో నిలువునా అగౌరవ పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ దారుణ మోసాన్ని గుర్తించారని, తగిన రీతిలో బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని ప్రకటించారు వద్దిరాజు రవిచంద్ర. చట్టం కాక ముందే ప్రభుత్వం జీఓ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. రాజకీయంగా మైలేజీ వచ్చేందుకు, మరింత కోల్పోయిన డ్యామేజ్ ను కాపాడుకునేందుకే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకు వచ్చారంటూ ఆరోపించారు వద్ది రాజు రవిచంద్ర. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిస్తే తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడం సాధ్యమవుతుందని అన్నారు. బీసీలు అన్నీ గమనిస్తున్నారని, తగిన తీరిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీసీ బిడ్డలు అందరూ తిరగ బడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.






