బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత
సత్యసాయి జిల్లా : కేంద్రం తీసుకు వచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల పేదలు, మధ్య తరగతి వర్గాలకు మేలు జరుగుతుందన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. శ్రీ సత్యసాయి జిల్లాలో కూటమి సర్కార్ ఆధ్వర్యంలో జీఎస్టీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి పాల్గొని ప్రసంగించారు. దీర్ఘకాలిక వ్యాధులకు వినియోగించే ఔషధాలు జీఎస్టీ నుండి మినహాయించారన్నారు. వీటిని ప్రజలకు తెలియజేసి, జీఎస్టీ లబ్దిని ప్రతీ కుటుంబం సద్వినియోగం చేసుకునేలా నెల రోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి వారం ఇంటింటికీ వెళ్లి జీఎస్టీ తగ్గింపు కారణంగా ఏ వస్తువులు ఏ మేరకు తగ్గాయి, ప్రతీ కుటుంబానికి నెలకు ఎంత మేరకు ఆదా అవుతుందనే విషయాన్నీ తెలియజేయడం జరిగిందన్నారు.
రెండవ వారం వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి వినియోగించే వస్తువులపై రైతులకు అవగాహన కలిగిస్తున్నామని, మూడవ వారం మానవ వనరుల అభివృద్ధి, విద్య, టూరిజం తదితర వాటికి సంబంధించి అవగాహన కలిగించడం జరుగుతుందని చెప్పారు. నాల్గవ వారం ద్విచక్ర వాహనాలు, కారులు, భారీ వాహనాలపై జీఎస్టీ తగ్గుదల అంశాలపై ప్రజలకు తెలియజేయడం చేస్తున్నారు. ప్రజలు వస్తువులను కొనుగోలు చేసే సమయంలో గతంలో ధరలు, జీఎస్టీ తగ్గిన తరవాత ధరలు గురించి వ్యాపారులను అడిగి తెలుసు కోవాలన్నారు. ప్రతీ కొనుగోలుకు తప్పనిసరిగా బిల్లులు పొందాలని కలెక్టర్ సూచించారు.






