బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి
హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ స్పీకర్ , ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి. తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసిందన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు మద్దతు తెలిపితే ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పట్టించు కోలేదన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆ పార్టీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ది ఏమిటో ఈపాటికే ప్రజలకు అర్థమై పోయిందన్నారు. చిల్లర రాజకీయాల కోసం బీసీలను పావుగా వాడుకోవాలని అనుకోవడం దారుణమన్నారు మధుసూదనా చారి. స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటే గ్రామాల్లో ఉత్సాహ పూరితమైన ప్రత్యేక వాతావరణం ఉంటుందన్నారు. కానీ, ఇవాళ నామినేషన్ పత్రాలు ఎవరూ తీసుకునేందుకు రాలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ప్రజలకు స్పష్టత ఉందన్నారు. బీసీల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి నిబద్ధత ఉందని స్పష్టం చేశారు మధుసూదనా చారి.తొమ్మిదో షెడ్యూల్‌లో పెడితేనే న్యాయం జరుగుతుందని పదేపదే చెప్పామన్నారు. ఈ విషయాన్ని తాను శాసన మండలిలో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డికి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే చిత్తశుద్ది లేదన్నారు. కావాలనే ఇస్తున్నట్లు నటించాడని, తానే కోర్టులో పిటిషన్లు వేయించాడని ఆరోపించారు మాజీ స్పీకర్. 60 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి బీసీ బిల్లు ఆమోదం కోసం ప్రయత్నం చేయలేదన్నారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్రోహపూరిత వైఖరిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. బీసీలు శక్తిగా ఇటువంటి కుట్రలను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.






